

హైదరాబాద్: ఐటీ సేవల రంగంలో కీలక ముందడుగుగా, అమెరికాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు కోఫోర్జ్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ఎన్కోరాలో 100 శాతం వాటాలను స్వాధీనం చేసుకునేందుకు 2.35 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21,133 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ ఆధారితంగా జరగనుంది.
డీల్లో భాగంగా, ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు కోఫోర్జ్ 1.89 బిలియన్ డాలర్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనుంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ వంటి ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఎన్కోరాలో పెట్టుబడిదారులుగా ఉన్నాయి.
ఈ కొనుగోలుతో తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ తెలిపారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల విలువైన గ్లోబల్ టెక్ సేవల సంస్థగా కోఫోర్జ్ అవతరిస్తుందని కంపెనీ పేర్కొంది.
2027 ఆర్థిక సంవత్సరానికి ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా మరియు క్లౌడ్ సేవల విభాగం ఆదాయం మొత్తం 2 బిలియన్ డాలర్లకు మించనున్నట్లు అంచనా వేసింది. ఇందులో ఏఐ ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లు, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ విభాగం 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండనున్నట్లు కోఫోర్జ్ వివరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!