

యాపిల్ ఏఐ(AI) ప్రాజెక్టులకు ఇప్పటివరకు వినియోగదారులు, పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తాజా ఎర్నింగ్స్ కాల్లో CEO టిమ్ కుక్ ఏఐను కీలక రంగంగా పేర్కొన్నప్పటికీ, ఆదాయం సాధించే స్పష్టమైన ప్రణాళికలను వెల్లడించకపోవడంతో షేర్ మార్కెట్లో ప్రతికూల ప్రభావం కనిపించింది. ఈ నేపథ్యంలో, యాపిల్‌కు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఇటీవల యాపిల్‌కు చెందిన నలుగురు ఏఐ పరిశోధకులు సంస్థను వీడారు. వీరిలో యిన్ఫీ యాంగ్, హావ్షువాన్ యూ, బైలిన్ వాంగ్, జిరుయ్ వాంగ్ ఉన్నారు. అంతకుముందు సీనియర్ డైరెక్టర్ స్టువార్ట్ బవర్స్ కూడా యాపిల్‌ను వీడి ప్రత్యర్థి సంస్థలో చేరారు. యూ, బైలిన్ వాంగ్ మెటాలో చేరగా, జిరుయ్ వాంగ్ మరియు బవర్స్ గూగుల్ డీప్‌మైండ్‌లో చేరినట్లు సమాచారం. యాంగ్ మాత్రం తన స్వంత స్టార్టప్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నిపుణులంతా యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ టీమ్‌తో పనిచేసినవారే కావడం గమనార్హం. అయినప్పటికీ, సిరి ప్రాజెక్టుల విషయంలో యాపిల్ ముందుకు సాగుతోందని నివేదిక చెబుతోంది. అడ్వాన్స్డ్ సిరి ద్వారా వినియోగదారుడి డివైస్‌లోని డేటాను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మరోవైపు ‘కాంపోస్’ అనే చాట్‌బాట్ తరహా సిరిని ఈ ఏడాది చివర్లో ఐఓఎస్ 27 తో పాటు విడుదల చేయాలని యాపిల్ యోచిస్తోంది. ఈ సిరి వెర్షన్లు గూగుల్ ఏఐ మోడళ్ల ఆధారంగా పనిచేస్తాయని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!