

ఏఐ రంగంలోని ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ భారీ నిధులను సమీకరించింది. తాజా సిరీస్-H ఫండింగ్ రౌండ్లో $65 బిలియన్ సమీకరించిన సంస్థ, తన మార్కెట్ విలువను $965 బిలియన్కు చేర్చుకుంది. దీంతో మార్చి 2026 నాటికి $852 బిలియన్ విలువ కలిగిన ఓపెన్‌ఏఐను అధిగమించి ఏఐ రంగంలో అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ నిధులను క్లాడ్ ఏఐ సేవల విస్తరణ, కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఫిబ్రవరి 2026లో $380 బిలియన్గా ఉన్న ఆంత్రోపిక్ విలువ కేవలం కొన్ని నెలల్లోనే రెండింతలకు పైగా పెరగడం విశేషం. క్లాడ్ ఏఐ కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సీక్వోయా క్యాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలు ఈ ఫండింగ్‌లో పాల్గొన్నాయి. అమెజాన్, శాంసంగ్, మైక్రాన్, ఎస్కే హైనిక్స్ వంటి వ్యూహాత్మక భాగస్వాములు కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిణామం ఆంత్రోపిక్-ఓపెన్ఏఐ మధ్య పోటీని మరింత తీవ్రతరం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!