

ఐసీసీ నిర్వహించే మెగా క్రికెట్ టోర్నీల్లో భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌కే మించిన ఆసక్తి ఈ పోరు పై కనిపిస్తుంది. టికెట్లు విడుదలైన వెంటనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. బ్లాక్ మార్కెట్లో అయితే లక్షల రూపాయల ధర పలికే పరిస్థితి ఉంటుంది.
ఈ మ్యాచ్ ద్వారా ఐసీసీకి మాత్రమే కాదు, ప్రసార సంస్థలు, స్పాన్సర్లు, ప్రకటనదారులకు కూడా భారీ ఆదాయం లభిస్తుంది. అందుకే సాధారణంగా భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచి మ్యాచ్ షెడ్యూల్ చేస్తారు.
అయితే ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే క్రికెట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంచనాల ప్రకారం భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే దాదాపు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే సుమారు రూ.2200 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రసార హక్కులు, ప్రకటనల రేట్లు, స్పాన్సర్షిప్ ఒప్పందాలు, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య లావాదేవీలను పరిగణలోకి తీసుకుని ఈ లెక్కను వేశారు.
ఈ మ్యాచ్ సమయంలో ప్రకటనల రేట్లు గణనీయంగా పెరుగుతాయి. కేవలం 10 సెకన్ల ప్రకటనకే సుమారు రూ.40 లక్షల వరకు ధర పలుకుతుంది. సాధారణంగా వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ సగటు విలువ రూ.138 కోట్లు మాత్రమే ఉండగా, భారత్–పాక్ మ్యాచ్ విలువ మాత్రం దానికి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 న జరగాల్సిన ఈ మ్యాచ్ నిలిచిపోతే, ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు కలిపి దాదాపు రూ.200 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలమైన భారత క్రికెట్ బోర్డుకు ఈ నష్టం పెద్దగా ప్రభావం చూపకపోయినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఇది తీవ్రమైన దెబ్బగా మారనుంది.
పీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ.325 కోట్లే. ఇలాంటి పరిస్థితిలో మ్యాచ్‌ను స్వచ్ఛందంగా బాయ్‌కాట్ చేస్తే బీమా రక్షణ కూడా వర్తించదు. అదనంగా ఐసీసీ విధించే జరిమానాలు, ప్రసార సంస్థల నుంచి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మొత్తానికి ఒక్క మ్యాచ్ ఆడకపోవాలన్న నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పునాదులకే ముప్పుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!