

పాకిస్థాన్ జాతీయ టెస్ట్ క్రికెట్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, అక్కడి క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆటగాళ్లకు భారీగా జీతాలు, మ్యాచ్ ఫీజులను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా వస్తున్న కేటగిరీల పద్ధతిని పూర్తిగా రద్దు చేసిన బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ, మొట్టమొదటిసారిగా ఫార్మాట్ల ఆధారంగా సరికొత్త కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకువచ్చారు.
ఈ సరికొత్త మార్పుల ప్రకారం, కేవలం టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడే అత్యుత్తమ ఆటగాళ్లను ట్రాక్-ఏ విభాగంలో చేర్చారు. వీరికి నెలకు దాదాపు 40 లక్షల పాకిస్థానీ రూపాయల రిటైనర్ ఫీజు లభించనుంది. దీనితో పాటు ఇప్పటివరకు రూ. 8 లక్షలుగా ఉన్న ఒక టెస్ట్ మ్యాచ్ ఫీజును ఏకంగా 15 లక్షల రూపాయలకు పెంచారు. అంటే దాదాపు రెట్టింపు ఫీజును ఇకపై ఆటగాళ్లు అందుకోనున్నారు. అలాగే టెస్ట్, వన్డేలు రెండూ ఆడే సీనియర్ ఆటగాళ్లను ట్రాక్-ఏబీ కేటగిరీలో చేర్చారు. వీరికి నెలకు గరిష్ఠంగా 50 లక్షల రూపాయల వరకు జీతం అందే అవకాశం ఉంది. దీనివల్ల మ్యాచ్ ఫీజులు కాకుండా కేవలం కాంట్రాక్ట్ ద్వారానే వీరు ఏడాదికి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా పెరిగిపోవడంతో ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్కు దూరం కాకుండా ఉండటానికే ఈ భారీ పారితోషికాలు ప్రకటించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఈ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాలని, లేదంటే కాంట్రాక్టులు ఇవ్వబోమని చైర్మన్ స్పష్టం చేశారు. అలాగే జట్టు ప్రదర్శనను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన బోనస్ విధానాన్ని కూడా పీసీబీ ప్రకటించింది. దీని ప్రకారం పాకిస్థాన్ జట్టు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే ఆటగాళ్లకు లభించే మ్యాచ్ ఫీజుపై ఏకంగా 500 శాతం అదనపు బోనస్ లభిస్తుంది. అలాగే ఆసియా కప్ లాంటి టోర్నీలు గెలిస్తే 300 శాతం బోనస్ అందజేస్తారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!