

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్‌లో 85 కేజీల బరువును ఎత్తి కొత్త కామన్‌వెల్త్ రికార్డు నెలకొల్పింది. తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైన ఆమె, రెండో ప్రయత్నంలో విజయం సాధించి, చివరి ప్రయత్నంలో 85 కేజీలతో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో 2018, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లలో కూడా స్వర్ణ పతకాలు గెలిచిన మీరాబాయి, మరోసారి తన ప్రతిభను నిరూపించింది.
పురుషుల విభాగంలో చనంబమ్ రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని సాధించాడు. స్నాచ్‌లో 121 కేజీలతో కామన్‌వెల్త్ రికార్డు నమోదు చేసిన ఆయన, క్లీన్ అండ్ జెర్క్‌లో 143 కేజీలు ఎత్తాడు. అయితే చివరి ప్రయత్నంలో విఫలమవడంతో స్వర్ణం చేజారింది. మలేషియా క్రీడాకారుడు మహమ్మద్ అనిక్ కాస్దాన్ 273 కేజీలతో స్వర్ణం గెలుచుకోగా, కెన్యాకు చెందిన జోషువా ఎంబోయా 260 కేజీలతో కాంస్యం సాధించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!