

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. సారథ్య బాధ్యతలను విడిచిపెట్టింది. ఇటీవలే ఆసియా కప్, ఆసియా క్రీడల్లో జట్టును విజేతగా నిలిపిన ఆమె.. వెంటనే కెప్టెన్సీ నుంచి వైదొలిగింది. హర్మన్‌ప్రీత్‌కు 37 ఏళ్లు వచ్చేసిన నేపథ్యంలో ఆమెకు ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన స్థితిలో ఆమే స్వయంగా ఈ బాధ్యతల నుంచి వైదొలగింది. ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. సారథ్య బాధ్యతలను అందుకోనుంది. ఇటీవల గువాహటిలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశంలో కెప్టెన్సీ మార్పు మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగిన సమావేశానికి హర్మన్, స్మృతిలతో పాటు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ హాజరయ్యారు. 2028లో టీ20 ప్రపంచకప్, ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని.. హర్మన్ స్థానంలోకి కొత్త కెప్టెన్‌ను తీసుకురావాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.
‘‘అన్ని ఫార్మాట్లలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తప్పుకొంటున్నా. ఇదంత తేలికైన నిర్ణయం కాదు. ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలు, ఘటనలు నాతో పాటు జీవితాంతం కొనసాగుతాయి. నేను నా బాధ్యతలను నిర్వర్తించాను. జట్టు కోసం ఇవ్వాల్సిందంతా ఇచ్చాను. భారత జట్టును నడిపించే అవకాశం దక్కినందుకు కృతజ్ఞురాలిని. ఇందుకు గర్విస్తాను కూడా. ఇప్పుడు పేజీ తిప్పాల్సిన సమయం వచ్చింది. కెప్టెన్‌గా నా అధ్యాయం ముగిసినా.. భారత క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆటలో కొనసాగేందుకు సిద్ధం. సారథ్యం ముగిసింది. ప్రయాణం కొనసాగుతుంది’’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. హర్మన్‌ప్రీత్ 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20ల్లో జట్టును నడిపించింది. ఆమె సారథ్యంలో గత ఏడాది భారత జట్టు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని సంచలనం రేపింది. ఆసియా క్రీడల్లో కూడా జట్టును వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపింది హర్మన్‌ప్రీత్.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!