

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 52వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నా, గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ స్కోర్ సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులతో చెలరేగగా, సాయి సుదర్శన్ 55 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జంటగా నిలిచారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు, రాహుల్ తెవాటియా వేగంగా 14 పరుగులు చేసి జట్టుకు మరింత బలం చేకూర్చారు.
230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వేగంగా 36 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినా, మిగతా బ్యాటర్లు గుజరాత్ బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. రవీంద్ర జడేజా 38 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పాడు. జేసన్ హోల్డర్ మూడు వికెట్లు, కగిసో రబడా రెండు వికెట్లు సాధించి రాజస్థాన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశారు. ఫలితంగా రాజస్థాన్ జట్టు 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ గాయం కారణంగా దూరం కావడంతో యశస్వి జైస్వాల్ జట్టును నడిపించాడు. అయితే గుజరాత్ టైటాన్స్ సమిష్టి ప్రదర్శన ముందు రాజస్థాన్ జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఘనవిజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మరింత బలమైన స్థానం సంపాదించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!