

ఇంగ్లాండ్‌లో జరగనున్న ది హండ్రెడ్ టోర్నీలో ఇండియన్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను వేలంలో దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ జట్టు ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్‌కు చెందింది. లండన్‌లో జరిగిన వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ.2.34 కోట్లుకు కొనుగోలు చేశారు. దీంతో సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో‘బాయ్‌కాట్ సన్‌రైజర్స్’, ‘షేమ్ ఆన్ ఎస్ఆర్ హెచ్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
2025లో అబ్రార్ అహ్మద్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు భారత సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే అలాంటి ఆటగాడిని తీసుకోవడం దేశాన్ని అవమానించినట్లేనని కొంతమంది అభిమానులు విమర్శిస్తున్నారు. సన్‌రైజర్స్ బ్రాండ్ సీఈవో కావ్య మారన్ పై కూడా కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూకేలో ఉన్న వివక్ష వ్యతిరేక చట్టాల ప్రకారం జాతీయత ఆధారంగా ఆటగాళ్లను తప్పించడం సాధ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇండియన్ యాజమాన్యంలోని జట్లు పాకిస్థాన్ ఆటగాళ్లను పూర్తిగా దూరం పెట్టలేకపోయాయని వారు పేర్కొంటున్నారు. మరోవైపు కొందరు క్రికెట్ నిపుణులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం ప్రపంచంలో మంచి వైట్ బాల్ స్పిన్నర్లలో ఒకడని, గత 38 టీ20 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీసిన ప్రతిభ ఆధారంగానే అతడిని ఎంపిక చేశారని చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!