

బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ నుంచి అజిత్ అగార్కర్ వైదొలగడంతో ఖాళీ అయిన వెస్ట్ జోన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీలో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రతినిధులు ఉంటారు. అగార్కర్ పదవీకాలం ముగియడంతో ముంబయి, గుజరాత్, సౌరాష్ట్ర, బరోడా, మహారాష్ట్ర, విదర్భకు చెందిన మాజీ క్రికెటర్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం శివ్ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ ప్యానెల్‌లో ఉన్నారు. దరఖాస్తుదారులు బీసీసీఐ నిర్దేశించిన ఆట అనుభవ అర్హతలను కలిగి ఉండటంతో పాటు కనీసం ఐదేళ్ల క్రితం క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నవారై ఉండాలి. అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కొత్త వెస్ట్ జోన్ సభ్యుడి ఎంపిక పూర్తిస్థాయి చీఫ్ సెలక్టర్ ఎంపికపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా కూడా ఈ పదవికి పోటీదారుల్లో ఉన్నాడు. అయితే కొత్తగా ఎంపికయ్యే సభ్యుడికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ అనుభవం ఉంటే.. అతడినే చీఫ్ సెలక్టర్‌గా నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మాజీ భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్, వసీం జాఫర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జహీర్ ఖాన్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, ఇటీవల సీఎస్‌కే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన సెలక్షన్ కమిటీలోకి వచ్చే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!