

యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో టెస్టులో కూడా ఇంగ్లాండ్ పై దూకుడు కొనసాగించిన ఆసీస్ జట్టు, 8 వికెట్ల తేడాతో సులభ విజయాన్ని నమోదు చేసింది. దీంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి చేరింది.
ఓవర్‌నైట్ స్కోరు 134/6 తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్, చివరికి 75.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 50; 152 బంతుల్లో 4×4, విల్ జాక్స్ 41; 92 బంతుల్లో 2×4 ధైర్యంగా పోరాడినా జట్టు మొత్తాన్ని కాపాడలేకపోయారు.
ఈ ఇన్నింగ్స్‌లో మైకేల్ నీసర్ (5/42) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను ఛేదించాడు. విల్ జాక్స్‌ను నీసర్ బౌలింగ్ పై స్టీవ్ స్మిత్ అద్భుత క్యాచ్‌తో ఔట్ చేయడం కీలక ఘట్టమైంది. ఈ వికెట్‌తో స్టోక్స్–జాక్స్‌ల మధ్య సాగిన 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే స్టోక్స్ కూడా నీసర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ వేగంగా కూలిపోయింది.
65 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఆసీస్ 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ట్రావిస్ హెడ్ (22), జేక్ వెదరాల్డ్ (17 నాటౌట్), స్టీవ్ స్మిత్ (23 నాటౌట్) ముగ్గురూ ఆత్మవిశ్వాసంగా ఆడి జట్టును గెలిపించారు.
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ప్రభావం చూపిన మిచెల్ స్టార్క్ (6/75, 77, 2/64) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
యాషెస్ మూడో టెస్ట్ అడిలైడ్‌లో ఈ నెల 17న ప్రారంభం కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!