

తెలుగు బుల్లితెరపై విశేష ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో 10వ సీజన్‌కు సిద్ధమవుతోంది. షో ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలవడంతో హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ జడ్జిలుగా బిందు మాధవి, నవదీప్, అభిజిత్‌ల ఎంపికను అన్వేష్ ప్రశ్నించారు. షోకు సంబంధించిన కొన్ని రీల్స్ చూశానని, జడ్జిల ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో తనకు అర్థం కావడం లేదని నాగార్జునను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారి సినీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి కార్యక్రమాలకు మరింత విస్తృత గుర్తింపు, అనుభవం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
తన అభిప్రాయం ప్రకారం ఐపీఎస్ అధికారి సజ్జనార్, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు బ్రహ్మానందం వంటి అనుభవజ్ఞులను జడ్జిలుగా తీసుకుంటే భిన్నమైన దృక్పథాలు లభిస్తాయని అన్వేష్ సూచించారు. వినోద కార్యక్రమాల్లోనూ అనుభవజ్ఞులు, ప్రతిభావంతులు భాగం కావచ్చని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ప్రశ్నలను సమర్థిస్తుండగా, మరికొందరు వ్యాఖ్యానించిన విధానాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై బిగ్‌బాస్ టీమ్ లేదా నాగార్జున స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!