

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2లో 20వ ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులు, టాస్కులు, భావోద్వేగాలతో సాగింది. భాగీ, హేమంత్, రామకృష్ణ, అమన్ డేంజర్ జోన్‌లో ఉండగా.. మిగిలిన కంటెస్టెంట్లకు వారిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. మెజార్టీ కంటెస్టెంట్లు అమన్‌ను సేవ్ చేశారు. అయితే ఎల్లో కార్డును మరో కంటెస్టెంట్‌కు బదిలీ చేయాల్సి రావడంతో అమన్ తన కార్డును చరణ్‌కు ఇచ్చాడు. దీంతో చరణ్, రామకృష్ణ, హేమంత్, భాగీ డేంజర్ జోన్‌లో మిగిలారు. అనంతరం జంటలుగా టాస్కులు నిర్వహించగా.. చరణ్, రామకృష్ణ ఒక జట్టుగా, హేమంత్, భాగీ మరో జట్టుగా పోటీపడ్డారు. మొదటి టాస్కులో చరణ్, రామకృష్ణ గెలవగా.. చివరకు చరణ్ సేఫ్ అయ్యాడు. మరో టాస్కులో హేమంత్ అద్భుతంగా ఆడి విజయం సాధించడంతో భాగీ డేంజర్ జోన్‌లోకి వెళ్లింది.
చివరికి భాగీ, రామకృష్ణలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ కంటెస్టెంట్లు భాగీని సేవ్ చేయాలని అభిప్రాయపడగా.. రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను నిజాయతీగా ఉన్నానని, తనకు సాధ్యమైనంత వరకు పోరాడానని, టాస్కుల్లో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో పలువురు కంటెస్టెంట్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే జ్యూరీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంటెస్టెంట్ల అభిప్రాయం తుది నిర్ణయం కాదని స్పష్టం చేస్తూ.. భాగీ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించింది. రామకృష్ణలో ఓడిపోయినా మళ్లీ పోరాడాలనే పట్టుదల కనిపిస్తోందని జ్యూరీ పేర్కొంది. దీంతో రామకృష్ణ సేఫ్ కాగా.. భాగీ అగ్నిపరీక్ష నుంచి బయటకు వెళ్లింది. ఇదే చివరి ఎలిమినేషన్ అని శ్రీముఖి ప్రకటించడంతో.. ఇక ఓటింగ్ ద్వారా అగ్నిపరీక్ష నుంచి ఎంతమంది బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెడతారన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!