

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ చిత్రానికి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మారియా ర్యాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో 45 రోజులుగా కొనసాగుతున్న షెడ్యూల్‌లో కీలకమైన జైలు ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.
కథలో అత్యంత కీలకమైన ఈ జైలు ఎపిసోడ్‌లో ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మనోజ్, సముద్రఖని మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొంది. కొత్త నటుడు అఖిల్‌ను ప్రతినాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు వెల్లడించింది. డేవిడ్ రెడ్డి పాత్రకు మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధులతో ఉన్న సంబంధాన్ని సరికొత్త కోణంలో చూపించనున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన ‘వార్ డాగ్’ బైక్ మరో ఆకర్షణగా నిలవనుంది. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచాన్ని సహజంగా, భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులను కూడా ప్రారంభించినట్లు చిత్రబృందం వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!