

బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి కూడా కామన్ మ్యాన్ కంటెస్టెంట్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తొమ్మిదో సీజన్ విజేతగా నిలిచిన కల్యాణ్ పడాల ఆర్మీ మ్యాన్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయనకు రూ.40 లక్షల నగదు, కారు, స్థలం లభించాయి. కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్న కల్యాణ్ ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తూ, కొత్త లుక్‌తో హీరోగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో సీజన్‌లో గౌతమ్ విజేత అవుతారని చాలామంది భావించినప్పటికీ నిఖిల్ మలియక్కల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టైటిల్ గెలుచుకున్నారు. ఆయనకు రూ.55 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ప్రస్తుతం నిఖిల్ తెలుగు టీవీ సీరియల్స్‌లో కొనసాగుతూనే, కన్నడ సినిమాల్లో హీరోగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా, యూట్యూబర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన విజయం తర్వాత అభిమానులు నిర్వహించిన సంబరాలు పోలీసు కేసులకు దారితీశాయి. ఈ క్రమంలో ప్రశాంత్, ఆయన సోదరుడు అరెస్టయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ వ్యాపారంపై దృష్టి పెడుతూ సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. అయితే రన్నరప్ శ్రీహాన్ రూ.40 లక్షల ప్రైజ్ మనీని తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. షో తర్వాత రేవంత్ పెద్దగా ఈవెంట్లలో కనిపించకపోయినా, టాలీవుడ్‌లో ప్రముఖ సింగర్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఐదో సీజన్ విజేత వీజే సన్నీ తొలుత జర్నలిస్టుగా పనిచేసి, ‘కల్యాణ వైభోగం’ సీరియల్ ద్వారా గుర్తింపు పొందారు. ప్రస్తుతం చిన్న సినిమాల్లో నటిస్తూ, హైదరాబాద్‌లో రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ విజేత అభిజీత్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో గుర్తింపు పొందారు. హౌస్‌లో వ్యతిరేకత ఎదురైనా ప్రేక్షకుల నుంచి భారీ మద్దతుతో టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో సినిమాలకు కొంతకాలం విరామం తీసుకున్న ఆయన ప్రస్తుతం ట్రావెలింగ్‌ను ఆస్వాదిస్తూ, కామన్ మ్యాన్‌ల కోసం నిర్వహించే ‘అగ్నిపరీక్ష’ ఆడిషన్స్‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
మూడో సీజన్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు బిగ్‌బాస్ విజయం తర్వాత కెరీర్‌లో మంచి గుర్తింపు లభించింది. ‘ఆర్ఆర్ఆర్’లోని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను కూడా ఆయన ఆలపించారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకున్న రాహుల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల్లోనూ నిలిచారు. రెండో సీజన్ విజేత కౌశల్ మండాకు భారీగా అభిమానించే ‘కౌశల్ ఆర్మీ’ అండగా నిలిచింది. వివాదాస్పద విజేతగా నిలిచిన ఆయన కొంతకాలం తర్వాత ఇటీవల ‘కన్నప్ప’ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్‌పై కూడా విమర్శలు చేశారు. 2017లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన తొలి సీజన్ విజేత శివ బాలాజీ. విజయం తర్వాత నటనకు విరామం తీసుకుని వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించిన ఆయన ప్రస్తుతం మా అసోసియేషన్‌లో మంచు విష్ణు టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!