

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో వారం పోటీలు మరింత ఉత్కంఠగా సాగుతున్నాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి టాస్క్‌లు, టీమ్ గేమ్‌లతో హౌస్‌లో పోటీ వాతావరణాన్ని మరింత పెంచారు. ఇంటి సభ్యులను రెడ్, బ్లూ టీమ్‌లుగా విభజించి ఆధిపత్యం కోసం వివిధ టాస్క్‌లను నిర్వహిస్తున్నారు. భైరవ నాయకత్వంలోని రెడ్ టీమ్ పోటీలో ముందంజలో ఉండగా, సభ్యుల మధ్య వ్యూహాలు, విభేదాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజా ఎపిసోడ్‌లో ‘సైల్ టు డామినేషన్’ పేరుతో ప్రత్యేక టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొన్నారు. రెడ్ టీమ్ తరఫున వర్షిణి, అపూర్వ పోటీపడగా.. బ్లూ టీమ్ నుంచి దేబ్జానీ, సృష్టి బరిలోకి దిగారు. చక్రాలతో కూడిన చిన్న పడవ తరహా అమరికపై కూర్చొని, నిర్దేశిత డ్రమ్స్ వద్ద ఉన్న కర్రలకు తమ జట్టు జెండాలను వేగంగా అమర్చడం ఈ టాస్క్ ప్రధాన ఉద్దేశం.
టాస్క్ ప్రారంభమైన కొద్దిసేపటికే పోటీ తీవ్రంగా మారింది. ఈ క్రమంలో అపూర్వ పడవ తరహా అమరికపై నుంచి కిందపడిపోయింది. సంచాలకుడిగా వ్యవహరిస్తున్న త్రిగుణ్.. టాస్క్ నిబంధనల ప్రకారం ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అపూర్వ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాంప్రసాద్, రోహిత్ సహా పలువురు సభ్యులు కూడా త్రిగుణ్ నిర్ణయాన్ని ప్రశ్నించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.
తనను ఆట నుంచి తప్పించడానికి త్రిగుణ్ వ్యక్తిగత విభేదాలను కారణంగా చూపుతున్నాడని అపూర్వ ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఇతర సభ్యుల ఒత్తిడితో త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని అపూర్వను తిరిగి ఆటలోకి అనుమతించాడు. అనంతరం టాస్క్ కొనసాగగా.. బ్లూ టీమ్ సభ్యులు సృష్టి, దేబ్జానీ మెరుగైన ప్రదర్శనతో తమ జట్టుకు విజయాన్ని అందించారు.
ఓటమి అనంతరం అపూర్వ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తనకు శారీరక బలం సరిపోలేదని, నాన్-వెజ్ తినకపోవడం వల్ల కూడా బలం తక్కువగా ఉందని ఆమె పేర్కొంది. ఆమె వ్యాఖ్యలతో హౌస్‌లో కొంత సరదా వాతావరణం నెలకొంది. మొత్తంగా టాస్క్‌లు, నామినేషన్లు, టీమ్ ఆధిపత్య పోరుతో బిగ్‌బాస్ తెలుగు 10లో రోజురోజుకూ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!