

అక్కినేని నాగార్జున హోస్టింగ్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్-10 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లను ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి పంపించి, తాళం వేశారు హోస్ట్ అక్కినేని నాగార్జున. ‘నో మోర్ కామనర్స్.. నో మోర్ సెలబ్రిటీస్’ అంటూ ఈ సీజన్‌లో ఇక కంటెస్టెంట్లంతా ఒక్కటేనని చెబుతూ.. హౌస్‌పై ఓ కన్నేసి ఉంచాలని ఆడియన్స్‌ను కోరారు. ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ముగిసిన అనంతరం సోమవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి, వాగ్వాదానికి దారితీసినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
‘బిగ్ బాస్ 10’లో మొత్తం 10 స్పెషల్ పవర్స్ ఉంటాయని నాగార్జున ప్రకటించారు. మ్యాజిక్ కీలు గెలుచుకున్న కంటెస్టెంట్లకు ఈ ప్రత్యేక పవర్స్‌ను అందించారు. ప్రారంభ టాస్కుల్లో త్రిగుణ్, ఝాన్సీ, ఆటో రామ్ ప్రసాద్, షాలిని, నరేష్, శ్రష్టి, ముఖేష్ గౌడ, వర్షిణి సుందరరాజన్‌లు మ్యాజిక్ కీలు గెలుచుకుని మొత్తం ఎనిమిది పవర్స్‌ను సొంతం చేసుకున్నారు. మిగిలిన రెండు స్పెషల్ పవర్స్ కోసం హౌస్‌మేట్స్ మధ్య పోటీ నెలకొనేలా బిగ్ బాస్ టాస్క్‌ను రూపొందించారు. ఇప్పటికే మ్యాజిక్ కీలు గెలుచుకున్న ఎనిమిది మందిని.. మిగిలిన సభ్యుల్లో నుంచి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని ఆదేశించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.
ఇద్దరిని ఎంపిక చేసే విషయంలో త్రిగుణ్, షాలిని, ముఖేష్ గౌడ మధ్య ప్రధానంగా వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అమన్ గేమ్‌లో పెద్దగా పాల్గొనలేదని త్రిగుణ్ అభిప్రాయపడుతూ.. వంశీ, కృష్ణుడులను ఎంపిక చేసినట్లు ప్రోమోలో కనిపించింది. అయితే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, పాయింట్లు పూర్తిగా వినకుండా త్రిగుణ్ నిర్ణయం తీసుకుంటున్నారని షాలిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘అన్నీ నాకే తెలుసు’ అనే ధోరణిలో త్రిగుణ్ కొంచెం తొందరపడ్డారేమో అంటూ ముఖేష్ గౌడ కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించారు. దీంతో తొలిరోజే హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. అసలు త్రిగుణ్, షాలిని, ముఖేష్ గౌడ మధ్య ఏం జరిగింది? మిగిలిన రెండు మ్యాజిక్ కీలు చివరకు ఎవరికి దక్కాయి? అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!