

‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు కృష్ణుడు బిగ్ బాస్ తెలుగు 10లో 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఏవీ ద్వారా తన జర్నీని పరిచయం చేసుకున్న కృష్ణుడు.. ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్న సమయంలోనే ప్రమాదానికి గురయ్యానని తెలిపారు. ఆ ప్రమాదం తర్వాత బరువు పెరగడంతో హీరోగా చేయగలనా అనే సందేహం కలిగిందని చెప్పారు. అయితే ‘వినాయకుడు’ సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని, అదే తన జీవితంలో కీలక మలుపుగా మారిందని తెలిపారు. పెళ్లి, కుటుంబ జీవితం, పదేళ్ల విరామం గురించి కూడా కృష్ణుడు మాట్లాడారు. ఈ గ్యాప్‌లో తన కుమార్తెతో ఎక్కువ సమయం గడిపానని వెల్లడించారు.
అక్కినేని నాగార్జునతో జరిగిన సంభాషణలో తాను సినిమాల్లో కనిపించినంత అమాయకుడిని కాదని కృష్ణుడు చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తానని, అన్ని రకాల భావోద్వేగాలను ప్రదర్శిస్తానని తెలిపారు. ఎదుటివారి యాక్షన్‌ను బట్టి తన రియాక్షన్ ఉంటుందని చెప్పారు. చాక్లెట్లు, స్వీట్స్ తన బలహీనత అని అంగీకరించిన కృష్ణుడు.. వాటిని బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేసి సాధించుకుంటానని తెలిపారు. షోలోకి తాను వెళ్లేటప్పుడు తన కుమార్తె ఎంతో ఎమోషనల్ అయిందని, ఇంతకు ముందు ఆమెను ఎప్పుడూ ఒంటరిగా వదిలి వెళ్లలేదని చెప్పారు. ‘ఆర్య’, ‘పోకిరి’, ‘ఏమాయ చేశావే’, ‘హ్యాపీడేస్’, ‘జల్సా’, ‘ఓయ్!’, ‘ఆర్య 2’ వంటి చిత్రాల్లోనూ నటించిన కృష్ణుడు.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ షోలో ఆయన ప్రయాణం ఎంతకాలం సాగుతుంది, ఎలాంటి ఇమేజ్ను సొంతం చేసుకుంటారో చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!