

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ, సీపీఎం నాయకులతో పాటు విద్యావేత్తలు, విద్యాసంస్థల నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌తో పాటు గన్నవరం నియోజకవర్గాలకు చెందిన ప్రముఖులు సహా సుమారు 300 మంది పార్టీలో చేరినట్లు జనసేన వెల్లడించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హత ఉన్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం జనసైనికులు, వీరమహిళలు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను నాగబాబు పంపిణీ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!