

వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనుల్లో సుమారు 82 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. కాగితాలపై ఉన్న వెలిగొండ ప్రాజెక్టును క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, చిన్న ప్రాజెక్టును భారీ ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతో పాటు సొరంగాలు, డ్యామ్‌లు, భూసేకరణ వంటి కీలక పనులకు వైఎస్సార్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వైఎస్సార్ జలయజ్ఞం ఫలితమని ఆమె వ్యాఖ్యానించారు.
వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను షర్మిల తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు కొద్ది పనులు పూర్తి చేసి ప్రాజెక్టు మొత్తం ఘనతను తమదిగా చెప్పుకోవడం సరికాదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రెండో దశ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్ కృషిని గుర్తించాలని కోరుతూ, ప్రాజెక్టు ఘనతపై రాజకీయ ప్రచారం చేయడం తగదని షర్మిల స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!