

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ ఎన్నికల్లో తన గెలుపు కోసం, వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో అధికార కూటమి బలం, డబ్బు ప్రభావం, మూడు పార్టీల రాజకీయ శక్తిని ఎదుర్కొంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు పార్టీ పెద్దలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యకర్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, మద్దతుదారులు చూపిన ప్రేమ, ఆదరణ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా విశాఖ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నామని అన్నారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన సుమారు 3.40 లక్షల మంది ఓటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీగా, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలు, అన్యాయాల విషయంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తానని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైన కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణికి అభినందనలు తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సూచించారు. విశాఖ ప్రజల కష్టార్జితమైన రూ.1,700 కోట్ల జీవీఎంసీ నిధులు మళ్లించబడ్డాయని ఆరోపిస్తూ, కొత్త పాలకవర్గం తన అధికారాలను ఉపయోగించి ఆ నిధులను తిరిగి కార్పొరేషన్‌కు రప్పించాలని కోరారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆ నిధులను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!