

కడప జిల్లా పరిషత్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటికే దక్కించుకునే దిశగా ముందంజలో ఉంది. జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గాను 23 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జడ్పీ అధ్యక్ష పదవికి అవసరమైన స్థానాలను కూటమి సాధించింది. అదేవిధంగా మొత్తం 405 ఎంపీటీసీ స్థానాల్లో 350 చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. దీంతో 34 మండల పరిషత్ అధ్యక్ష పదవులు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన 16 జడ్పీటీసీ, 55 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లోనూ పట్టు సాధించాలని కూటమి ప్రయత్నిస్తుండగా.. జిల్లాలో తమ రాజకీయ పరువు నిలుపుకోవాలని వైఎస్సార్‌సీపీ పోరాడుతోంది.
జిల్లాలో మొత్తం 5,94,099 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో జడ్పీటీసీ పరిధిలో 4,47,809 మంది, ఎంపీటీసీ పరిధిలో 1,46,290 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 71 మంది జడ్పీటీసీ, 171 మంది ఎంపీటీసీ అభ్యర్థులు కలిపి 242 మంది బరిలో నిలిచారు. 599 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 3,912 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 599 మంది ప్రిసైడింగ్ అధికారులు, 599 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2,396 మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారు. 292 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం కేంద్రాల్లో 134 సున్నితమైనవి, 167 అత్యంత సున్నితమైనవి, ఐదు సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రత కల్పించారు. ఏడుగురు డీఎస్పీల పర్యవేక్షణలో 37 మంది సీఐలు, 76 మంది ఎస్సైలు, 1,027 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. బద్వేలు, జమ్మలమడుగు, కడప, పులివెందుల, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు మండలాల్లో ఈ ఎన్నికల పోరు కొనసాగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!