

తెలంగాణలో ఇటీవల మూడు దశలుగా గ్రామపంచాయితీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సంక్రాంతి తర్వాత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయితీరాజ్ శాఖ ప్రకటించింది.
గ్రామ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించే దిశగా, పల్లెల్లో అభివృద్ధి, నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణ, పంచాయతీ చట్టాలు, సర్పంచుల బాధ్యతలు మరియు అధికారాలు వంటి అంశాల పై పంచాయితీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లాల వారీగా ఒక్కో బ్యాచ్లో 50 నుంచి 100 మంది సర్పంచులకు శిక్షణ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,000 కు పైగా గ్రామపంచాయితీలు ఉండటంతో, ఈ శిక్షణ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అయితే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు, సర్పంచులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించిన అనంతరమే ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తామని పంచాయితీరాజ్ అధికారులు స్పష్టం చేశారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులు పాలనలో సమర్థవంతంగా పని చేయడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చర్య కీలకమని అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!