

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన సినిమాలు ఈ అవార్డులకు అర్హులుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఉన్న అవార్డు విభాగాలతో పాటు, ఈసారి కొన్ని కొత్త విభాగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక విభాగంలో డా. సి. నారాయణరెడ్డి అవార్డు కూడా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ఈ అవార్డులు అందుకు ఒక ముఖ్యమైన అడుగని మంత్రి పేర్కొన్నారు. అర్హత కలిగిన నిర్మాతలు మరియు ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను 2026 జనవరి 31 వరకు పొందవచ్చని తెలిపారు. అలాగే ఎంట్రీల సమర్పణకు 2026 ఫిబ్రవరి 3 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అర్హులైన నిర్మాతలను కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!