

రాష్ట్ర శాసనసభ మరియు శాసనమండలి సమావేశాలు ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇరు సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి, ఇటీవల మరణించిన ప్రజాప్రతినిధుల స్మృతికి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు నివాళులు అర్పించనున్నారు.
ఈ సందర్భంగా శాసనసభ, శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క పలు అధికారిక పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఇరు సభలు వాయిదా పడిన అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే అంశం పై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. కనీసం 15 రోజులపాటు సమావేశాలు జరపాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణ, గోదావరి నదీ జలాలు, సంబంధిత ప్రాజెక్టుల పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం పై చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీనికి ప్రత్యుత్తరంగా కృష్ణ–గోదావరి ప్రాజెక్టుల పై సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది.
అదేవిధంగా శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సభను హుందాగా, క్రమబద్ధంగా నడుపుకుందామని అన్ని రాజకీయ పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!