

ఎన్నికల్లో గెలవకుండా రాజ్యాంగం నిర్దేశించిన ఆరు నెలల గడువు దాటినా బిహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ పదవిలో ఎలా కొనసాగుతున్నారని సుప్రీంకోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం శాసనసభ లేదా శాసన మండలి సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిగా నియమిస్తే, ఆయన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీపక్ ప్రకాశ్ 2025 నవంబర్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, 2026 ఏప్రిల్ 25 వరకు పదవిలో కొనసాగారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాజీనామా చేయడంతో మంత్రివర్గం రద్దు కాగా, కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీపక్ ప్రకాశ్‌ను మరోసారి మంత్రిగా నియమించారు.
దీపక్ ప్రకాశ్‌ను రెండోసారి మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఎన్నిక కాకుండానే ఒక వ్యక్తి మంత్రిగా కొనసాగుతున్న అంశంపై బిహార్ ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన కీలక అంశమని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులకు భిన్నంగా క్యాజువల్ దుస్తుల్లో హాజరై దీపక్ ప్రకాశ్ అప్పట్లో కూడా వార్తల్లో నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!