

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ నటించిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏడుగురు మహిళలు కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భావోద్వేగాలు, బంధాలు, జీవిత ప్రయాణం చుట్టూ సాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాయల్ రాధాకృష్ణ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పోస్టర్లు చూసి ‘హ్యాపీ జర్నీ’ కేవలం అమ్మాయిల ప్రయాణానికి సంబంధించిన సినిమా అని భావించవద్దని, కథ క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ వారి జీవితాల్లో అబ్బాయిల ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుందని చెప్పారు. ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదని, సమాజంలో కొందరు దాని అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పాయల్ అభిప్రాయపడ్డారు. తండ్రి, సోదరుడు, కొడుకు, భాగస్వామి వంటి వివిధ బంధాల్లో పురుషులు జీవితంలో ముఖ్యమైన భాగమని తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో మగ దర్శకులు, నిర్మాతలు ఇచ్చిన సహకారం వల్ల సెట్స్‌లో తాము సురక్షితంగా, సౌకర్యంగా ఫీలయ్యామని చెప్పారు. తండ్రి లేదా సోదరుడిపై ప్రేమను వ్యక్తపరచలేకపోతున్న వారు కుటుంబంతో కలిసి ‘హ్యాపీ జర్నీ’ చూడాలని, ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుందని పాయల్ కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!