

తమిళనాడులోని కరూర్‌లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ప్రచార సభలో భారీ జనసంద్రం కరాళనృత్యం చేసింది. నియంత్రణ తప్పిన జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే మృతి చెందగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అదనంగా 40 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారీగా తరలి వచ్చిన అభిమానులు, స్థానిక ప్రజలతో జనసంద్రం అదుపు తప్పింది. గంటల తరబడి వేచి చూసినవారు ఒకేసారి ముందుకు కదలడంతో ఆక్సిజన్ లభించక పలువురు కుప్పకూలారు. ప్రజలు ఊపిరాడక పడిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి విషాదంగా మారింది.
విజయ్ తన ప్రసంగం మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. మూర్ఛపోయిన వారిని రక్షించమని పోలీసులకు, వాలంటీర్లకు పిలుపునిచ్చారు. తానే స్వయంగా వాటర్ బాటిల్స్ పంచి సహాయం చేయడం జరిగింది. అయితే అప్పటికే అనేక మంది పరిస్థితి విషమమైంది.
అల్లకల్లోలంలో ఒక 9 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయిందని సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ టీములు ఆమె కోసం వెతుకుతున్నాయి. మరోవైపు కరూర్ ఆసుపత్రుల్లో డాక్టర్లు గాయపడిన వారిని తీవ్రంగా చికిత్స చేస్తున్నారు.
ఈ విషాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని తెలిపారు. జిల్లా అధికారులు, మంత్రులు, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఈ తొక్కిసలాట రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రాజకీయ సమావేశాల్లో జనసంద్రం నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమానుల ప్రాణాలు పోయిన ఈ ఘటన తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!