

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నుంచి వైదొలిగిన మనీష్ బ్రహ్మభట్ గురువారం ఢిల్లీలో ‘సీజేపీ-డెమోక్రటిక్’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వేదిక.. బీజేపీని వ్యతిరేకించడానికే పరిమితమైందని విమర్శించారు. సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బ్రహ్మభట్ పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అయిన బ్రహ్మభట్.. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో వలంటీర్, కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే ఆగస్టు మొదటి వారంలో జరిగిన సీజేపీ కోర్ టీమ్ సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని అభిజీత్ దీప్కే నివాసంలో సమావేశం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లగా, లోపలికి అనుమతించలేదని, దీంతో అక్కడే నిరసనకు కూర్చున్నానని చెప్పారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో తాను, సహచరుడు రాహుల్ పాండ్యా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ పరిణామాల తర్వాత సీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన బ్రహ్మభట్.. ఇప్పుడు ‘సీజేపీ-డెమోక్రటిక్’ను ప్రారంభించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!