

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఎ. రేవంత్‌రెడ్డి సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌భవన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగించారు. అనంతరం ప్రభుత్వం సురేఖ తొలగింపుపై గజిట్ జారీ చేయడంతో ఆమె శాఖలు సీఎం పర్యవేక్షణలోకి వెళ్లాయి.
గత రెండు వారాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మీ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి తొలగించబడిన మూడో మంత్రిగా కొండా సురేఖ నిలిచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!