

లోక్‌సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేందుకు స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే, ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండటంతో అవన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం ఇద్దరు లోక్‌సభ సభ్యులు నోటీసుపై సంతకం చేయాలి. సభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సాధారణ ఆధిక్యంతో ఆమోదం పొందితే సరిపోతుంది. ఖాళీలను మినహాయించి మిగిలిన సభ్యులందరినీ లెక్కలోకి తీసుకుంటారని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీ.డి.టి. ఆచారి వెల్లడించారు.
తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయా లేదా అన్నది ప్రాథమిక దశలోనే పరిశీలిస్తారు. నోటీసును ఉపసభాపతికి కాకుండా సెక్రటరీ జనరల్‌కు సమర్పించాలి. తీర్మానంలో పరువు నష్టం కలిగించే భాష ఉండకూడదు. సాధారణంగా డిప్యూటీ స్పీకర్ ఈ భాషను పరిశీలిస్తారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేనందున ప్యానెల్ ఆఫ్ ఛైర్పర్సన్లలో అత్యంత సీనియర్ సభ్యుడు ఈ బాధ్యత నిర్వర్తించే అవకాశం ఉంది. తీర్మానం పరిగణనలో ఉన్న సమయంలో స్పీకర్ సభకు అధ్యక్షత వహించలేరు. దీనిని అనుమతించేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!