

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బుధవారం బెంగళూరులోని సీఎం అధికార నివాసం ‘కావేరి’కి మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుని రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని సిద్ధరామయ్య స్పష్టం చేసినట్లు సమాచారం. గురువారం నిర్వహించనున్న కీలక అల్పాహార సమావేశానికి మంత్రులందరికీ ఆహ్వానం పంపడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చ మొదలైంది.
ఇక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరుపుతూ ‘కొత్త సీఎం’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా మాత్రం నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీ అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ గురువారం సమావేశం కీలకంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!