

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమని, తమ నేతలు ఏదైనా ఉంటే బహిరంగంగా మాట్లాడతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ వివాదంపై పీసీసీ అబ్జర్వర్‌గా గత రెండు రోజులుగా విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు, తొమ్మిది మండలాల పార్టీ నాయకులతో సమావేశమై సమాచారం సేకరించినట్లు చెప్పారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. సినిమా డైలాగులు మాట్లాడటం మానేయాలని సూచిస్తూ, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినవి వాస్తవమని చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అప్పుల వడ్డీలు చెల్లించడమే ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారిందని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!