

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీకి సమగ్ర వివరణ పంపిన కవిత, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29A ప్రకారం తమ పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పరిశీలించి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా పదాలతో అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే నమోదై ఉన్నాయని, ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరు ఏ గుర్తింపు పొందిన పార్టీ పేరుతోనూ పోలిక లేదని ఆమె పేర్కొన్నారు.
పార్టీ పేరుపై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చినట్లు ఈసీ తెలిపినా, వాటి ప్రతులను ఇప్పటివరకు తమకు అందించలేదని కవిత అన్నారు. అభ్యంతరాల వివరాలు తెలియకుండా సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈసీ నుంచి ఏప్రిల్లో పార్టీ పేరుకు సంబంధించి సమాచారం అందిన తర్వాత రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. వ్యక్తిగత విచారణకు ముందు అన్ని అభ్యంతరాల కాపీలు, వాటికి సంబంధించిన ఆధారాలను అందించి, సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం కల్పించాలని ఈసీని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!