

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీధి వ్యాపారి మహ్మద్ ఇర్ఫాన్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఇర్ఫాన్ తెలిపారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అవసరమైతే దానిని కూడా వ్యతిరేకిస్తానని రాహుల్ గాంధీతో చెప్పినట్లు పేర్కొన్నారు.
వలస కార్మికులు, రోజువారీ కూలీల సమస్యలు, కనీస వేతనాలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కోరినట్లు ఇర్ఫాన్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌కు ముందే చదువు మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా అవకాశాలు మరింత విస్తరించాలని సూచించారు. సంభాషణలో రాహుల్ గాంధీ వివాహంపై సరదా వ్యాఖ్యలు కూడా జరిగాయని ఆయన వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చట్ట అమలుపై తన ఆందోళనలను కూడా ప్రస్తావించాలని ఉందని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!