

తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి విషయంలో మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని కడియం జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరిదేవికి ఇప్పిస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పదవి దక్కకుండా చేశారంటూ కడియపులంకకు చెందిన కొందరు జనసైనికులు శనివారం రాత్రి మంత్రి నివాసానికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెకు పదవి ఇప్పించేందుకు తాను ఎంతగానో ప్రయత్నించానని చెప్పారు. ఈ విషయాన్ని జడ్పీటీసీ సభ్యురాలి భర్త అయ్యప్పను అడగాలని సూచించారు. చివరి క్షణం వరకు ప్రయత్నించానని, తన సొంత టికెట్ కోసం కూడా చేయనంత కృషి చేశానని పేర్కొన్నారు. తాను ప్రయత్నించకపోతే ఆమెకు జడ్పీటీసీ టికెట్ కూడా వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. తన ప్రయత్నాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఈ వాగ్వాదాన్ని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
ఈ వివాదంపై జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరిదేవి భర్త రత్నం అయ్యప్ప ఆదివారం స్పందించారు. ఓ వీడియో విడుదల చేస్తూ.. పొత్తులో భాగంగా కాకినాడ జడ్పీ పీఠాన్ని జనసేనకు కేటాయించారని స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రయత్న లోపం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే మంత్రి గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి విషయంలో మంత్రి చివరి వరకు ప్రయత్నించారని, ఆయనను తప్పుబట్టడం సరికాదన్నట్లుగా అయ్యప్ప తన వివరణలో పేర్కొన్నారు. మంత్రి నివాసంలో జరిగిన వాగ్వాదం వీడియో వైరల్ కావడం, అనంతరం అయ్యప్ప వివరణ ఇవ్వడంతో జడ్పీ పీఠం అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!