

బీజేపీ, ఆరెస్సెస్‌లకు భారతీయ ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాలపై సరైన అవగాహన లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ రెండు సంస్థల్లో కులతత్వం, పురుషాధిక్య భావజాలం, అత్యాశ కలిగిన వ్యక్తులు ఉన్నారని వ్యాఖ్యానించారు. శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న చిత్రాన్ని జత చేస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భోజన సమయంలో తన తల్లి సోనియా గాంధీ అప్పుడప్పుడు తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని రాహుల్ వెల్లడించగా, దీనిపై బీజేపీ విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్.. భారతీయ ఆధ్యాత్మిక, మతపరమైన సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకున్న కొద్దీ వాటిపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. విసుగెత్తిన పిల్లి స్తంభానికి గోక్కొన్నట్లుగా రాహుల్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాజ్‌మహల్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. బీజేపీలో పురుషాధిక్య భావజాలం ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీయే మహిళా వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. దీంతో రాహుల్ గాంధీ, కంగనా రనౌత్ మధ్య రాజకీయ విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!