

పీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులను కేసీఆర్ అక్రమ కేసులు, ఒత్తిళ్ల ద్వారా బీఆర్ఎస్‌లోకి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తానని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అయితే తాను పీసీసీ అధ్యక్షుడిగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి కేవలం 90 రోజుల్లోనే 48 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించానని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ బలోపేతమైందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 92,35,833 ఓట్లు సాధించి 64 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పారు. మరో స్థానాన్ని సీపీఐ గెలుచుకుందని గుర్తుచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 స్థానాలు గెలవడమే లక్ష్యమని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతి నాయకుడి పనితీరు, మాటతీరును పార్టీ నిశితంగా గమనిస్తోందని, కష్టపడేవారిని గుర్తిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ.. కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా, 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, 3.42 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మంచి పనులను బహిరంగంగా ప్రచారం చేయాలని, లోపాలను మాత్రం పార్టీ అంతర్గతంగా చర్చించాలని సూచించారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!