

చిక్కుడుకాయలతో చేసే సంప్రదాయ వంటకాల్లో పాతకాలపు పద్ధతిలో తయారుచేసే చిక్కుడుకాయ కూర ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ కూర తయారీకి అరకిలో పెద్ద గింజలున్న చిక్కుడుకాయలు, పావు కిలో టమాటాలు, ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, వేరుశెనగ నూనె అవసరం. ముందుగా చిక్కుడుకాయలను శుభ్రం చేసి, వాటిలోని గింజలను వేరు చేయాలి. గింజల్లో పురుగులు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. అనంతరం చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, వేరుశెనగ నూనె వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. అనంతరం కూరగాయలు సగం మునిగేంత వరకు నీరు పోసి, మూత పెట్టి ఐదు నిమిషాలు అధిక మంటపై ఉడికించాలి. ఆ తర్వాత మంట తగ్గించి సుమారు 40 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది. ప్రత్యేకమైన మసాలాలు, కరివేపాకు లేకుండానే తక్కువ పదార్థాలతో తయారయ్యే ఈ కూరను కాస్త పొడిగా ఉడికించుకుంటే మరింత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!