

బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై చేసిన ఆరోపణలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ఇంపాక్ట్ ఫీజు పేరుతో ప్రభుత్వం 5 లక్షల కోట్ల కుంభకోణం చేసిందన్న కేటీఆర్ విమర్శలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు.
శ్రీధర్‌బాబు వివరించిన ప్రకారం కేటీఆర్ మాట్లాడే 9,292 ఎకరాల భూమిలో నిజంగా పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినవి 4,740 ఎకరాలేనని తెలిపారు. మిగిలిన భూమిని రహదారులు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఉపయోగించామని చెప్పారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో జరిగినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు దశలవారీగా ఇస్తూ వచ్చిన భూములేనని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, అజామాబాద్, కూకట్పల్లి, హఫీజ్‌పేట ప్రాంతాల్లోని పారిశ్రామిక భూములకు యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికలకి నాలుగు నెలల ముందు, 2023 ఆగస్టులో ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖ జారీ చేసిన జీవో నంబర్లు 19, 20, 21 ద్వారా ఈ హక్కులు ఇచ్చారని వివరించారు. ఆ సమయంలో ఎంత వసూలు చేసారో కేటీఆర్ ముందుగా చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఆ భూములకే కన్వర్షన్ అవకాశాన్ని ఇస్తోందని, 30 శాతం, 50 శాతం స్లాబులతో ఇంపాక్ట్ ఫీజును అమలు చేయాలని కేబినెట్ ఈ నెల 17 న తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తెలిపారు. ఈ విషయాలను దాచిపెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయన ఆగ్రహం తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!