

అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలపై స్పష్టత లేకపోయినా, తాజా పరిణామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. హర్మూజ్ జలసంధిను తిరిగి తెరవడానికి సిద్ధమని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అయితే, దీనికి రెండు ముఖ్యమైన షరతులు పెట్టింది. మొదటిగా, ఆ ప్రాంతంలో కొనసాగుతున్న అమెరికా నౌకాదళ చర్యలను నిలిపివేయాలని కోరింది. రెండవది, జలసంధి తిరిగి ప్రారంభమైన తర్వాతే అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు సమాచారం.
దీనిపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రతిపాదనలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని, కానీ ఇంకా ఒప్పందానికి సరిపోవని అభిప్రాయపడ్డారు. ఇక లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న చర్చలపై హెజ్బొల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్చలు దేశానికి హానికరమని హెచ్చరించింది. అయితే దీనికి ప్రతిగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, దేశ ప్రయోజనాల కోసం చర్చలు జరపడం తప్పు కాదని స్పష్టం చేశారు. విదేశీ ప్రయోజనాల కోసం దేశాన్ని యుద్ధంలోకి నెట్టడం అసలైన ద్రోహమని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది గాయపడ్డారు. మధ్యవర్తిత్వంపై కూడా విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం రెజాయీ, పాకిస్థాన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా అమెరికా డిమాండ్లపై అది స్పందించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఒమన్ తీరంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒమన్ సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంటీ సిరాన్ అనే చమురు నౌకపై ఇరాన్ తీర రక్షక దళాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 17 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మద్దతు కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాస్కోను సందర్శించి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు రష్యా సహకరిస్తుందని పుతిన్ తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!