

శర్వానంద్ హీరోగా, మాస్ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చిత్ర క్లైమాక్స్ షూటింగ్‌ను 22 రోజుల పాటు నిరవధికంగా నిర్వహించిన చిత్రబృందం, 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించింది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నే రూపొందించిన ప్రత్యేక సెట్లో ఈ షెడ్యూల్ చిత్రీకరించగా, క్లైమాక్స్ నిర్మాణం, ప్రణాళిక కోసం దాదాపు మూడు నెలల సమయం వెచ్చించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ చిత్రంలో ‘గంగా’ పాత్రలో నటిస్తున్న శర్వానంద్ లుక్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు రెండున్నర గంటల పాటు మేకప్ వేసుకోగా, షూటింగ్ ముగిసిన తర్వాత మేకప్ తొలగించేందుకు మరో గంట సమయం పట్టినట్లు సమాచారం. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!