

నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
వరి కోతలు ప్రారంభమయ్యే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అరవింద్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం రవాణా, నిల్వల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంటే రైతుల ధాన్యం తరలింపుకు కొరత ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించారు.
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్న అరవింద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల కంటే ప్రస్తుత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిరుద్యోగ భృతి, గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!