

అమెరికా భూతల దాడికి దిగినా లేదా ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం స్పష్టంగా ఉందని, అందులో ఎలాంటి సందిగ్ధత లేదని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి నిర్వహణ బాధ్యత ఇరాన్‌కేనని, ఈ అంశంపై ఒమన్‌తో పాటు ప్రాంతీయ దేశాలతో చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించే అవకాశం అమెరికాకు లేదని కూడా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే సైనిక సామర్థ్యం అమెరికాకు ఉన్నప్పటికీ, దానిని ఎక్కువకాలం తమ ఆధీనంలో ఉంచుకోవడం సవాలుగా మారుతుందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం నుంచి ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం జరుగుతుండటంతో, ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా మారింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!