

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి చేసిన విమర్శలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాము చేపట్టే పనులకు ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టిస్తున్నారని, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. గోపాల్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణంపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి ఈ వ్యవహారంపై నివేదికను ఏఐసీసీ అధిష్ఠానానికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారెడ్డి విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఆయనను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మిని ఆ స్థానంలో నియమించే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!