

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో భారీగా ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి బీఎం సందీప్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే బీజేపీ కౌంటర్ ర్యాలీలు నిర్వహిస్తోందని విమర్శించారు. ఎన్ని ర్యాలీలు చేసినా దేశ ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనలో సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాల హక్కులు, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛతో పాటు మహిళలు, కార్మికుల హక్కులకు రాజ్యాంగం భరోసా కల్పించిందని తెలిపారు. ఆ హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 19, 25 అధికరణలు కల్పించిన హక్కులను ప్రస్తావిస్తూ.. మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు విషయంలో అంబేడ్కర్ చేసిన కృషిని, కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి రావడంలో ఆయన పాత్రను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచి నిరంకుశ పాలనకు బీజేపీ ప్రయత్నిస్తోందని భట్టి ఆరోపించారు. ఏఐసీసీ నేత బీఎం సందీప్ మాట్లాడుతూ.. దేశ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర పరస్పరం ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై విమర్శలు గుప్పిస్తూ, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, ఓటు హక్కు కల్పించిందని తెలిపారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడమే రాజ్యాంగ గొప్పతనమని పేర్కొన్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రస్తావిస్తూ.. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లు ఇప్పటికే తొలగించారని, మరో ఏడు కోట్ల ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని మోదీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ స్థానాలు గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!