

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు మరో పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛతో పాటు మహిళలు, కార్మికుల హక్కులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సందీప్‌కుమార్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 19 ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ లభించాయని గుర్తుచేశారు. మహిళల హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషిని, కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలులో ఆయన పాత్రను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!