

రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. గతంలో రాజుల వారసులకే అధికారం పరిమితమై ఉండేదని, రాజ్యాంగం ద్వారా పాలన ప్రజల చేతుల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేడ్కర్‌కు దక్కుతుందన్నారు. కొందరు తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, వాటిని ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. రైతుల ఆదాయం రెట్టింపు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత కులమత భేదాలు, తప్పుడు హామీలతో వరుసగా అధికారాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లు ఇప్పటికే తొలగించారని, మరో ఏడు కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో ప్రజలు పాలకులను ఎన్నుకునేవారని, ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయించే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పలువురు నాయకులు చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 90 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!