

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ఆధ్వర్యంలో అమలవుతున్న మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాలు ‘సురక్షిత్’ హోదాను దక్కించుకున్నాయి. దీంతో తెలంగాణ 94 శాతం విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ 25, 2026 నాటి జాతీయ MAS డ్యాష్‌బోర్డ్ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర 92 శాతంతో రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ 83 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి.
NACO, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, సంరక్షణ సేవలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయంగా నిర్దేశించిన 95:95:99 లక్ష్యాల ఆధారంగా జిల్లాల పనితీరును అంచనా వేస్తున్నారు. ఈ విజయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు అధికారులను, వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. మిగిలిన రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ‘సురక్షిత్’ హోదా సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!