

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార కూటమి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవులపై దృష్టి సారించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన 27 జిల్లాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్ పదవులను కూటమి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, జనసేన, BJP పార్టీలకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పదవుల పంపకంపై కూటమి పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినప్పటికీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను బట్టి కొన్ని మార్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని ఛైర్‌పర్సన్ పదవులు కేటాయించాలి? ఏయే జిల్లాలను ఏ పార్టీకి ఇవ్వాలి? అనే అంశాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కొన్ని జిల్లాల్లో ఒక్కరి పేరు బలంగా వినిపిస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ముగ్గురు, నలుగురు నేతలు పోటీ పడుతున్నారు.
శ్రీకాకుళంలో జనసేనకు ఛైర్‌పర్సన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తుండగా, భవాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయనగరంలో చంద్రకళ, సిరిసహస్ర పోటీలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వీరేశ్‌చంద్రదేవ్ పేరు ముందంజలో ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ, జనసేన నేతలు పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోనూ పలువురు ఆశావహులు రేసులో ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ అభ్యర్థుల పేర్లపై చర్చ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా, మరికొన్ని చోట్ల పార్టీ నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. కూటమి పార్టీల మధ్య తుది చర్చలు పూర్తయిన తర్వాతే ఛైర్‌పర్సన్ పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!